• April 20, 2019

ప్రేమా పిచ్చి ఒక్కటే

శాంతమూర్తి అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం సావిత్రమ్మ. కానీ ఒకరోజు కొడుకు మీద అపర భద్రకాళీలా కోపపడింది.

“ఒరేయ్ పిచ్చి పట్టిన దాన్ని ఇంటికి తీసుకొస్తావా దాని పిచ్చి నీక్కూడా ఎక్కిందా” అంటూ కోపపడింది సావిత్రమ్మ.

సావిత్రమ్మ అంతలా కోపపడటం ఎప్పుడు చూడలేదు సత్యం.

మళ్ళి నెమ్మదిగా దగ్గరకి వచ్చి “పిచ్చి పట్టిన దాన్ని ఇంటికి తీసుకోస్తావా. మొన్న చూసావా ఎలా అరిచిందో పిల్లాడిని తాకను కూడా తాకనివ్వలేదు. దాన్ని ఇంటికి తీసుకొస్తే గదిలో పెట్టి తాళం వెయ్యాలి లేదంటే ఎవరిని ఏమి చేస్తుందో అని భయపడుతూ ఉండాలి. పిచ్చిదాన్ని ఇంటికి తీసుకొచ్చారు అని ఊరంతా చెప్పుకోరు….” అంది సావిత్రమ్మ.

సావిత్రమ్మ అలా అనగానే పదిరోజుల క్రితం జరిగిన సంగతి గుర్తొచ్చింది ముగ్గురుకి.

సావిత్రమ్మ, సత్యంలకి శంకరం ఒక్కడే కొడుకు. మంచి చదువు సంస్కారం కలిగినవాడు శంకరం. తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు సుధ. కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. భార్య నీళ్ళు పోసుకున్న కారణం చేత ఏడవ నెలలో పుట్టింటికి పంపించారు అత్త, మావయ్య, భర్త కలిసి.

భార్య సుధ అంటే అమితమైన ప్రేమ శంకరానికి. ఇద్దరూ ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరు. తను గర్భవతి అయినప్పుడు తనని ఎంతో గారాభంగా చూసుకున్నాడు. చివరికి నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది.

తను ఒక బిడ్డకు జన్మనిచ్చాడు అన్న ఆనందం శంకరం కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది ఆ సమయంలో. ఇక బిడ్డ పుట్టి పది రోజులు అయింది కదా అని బారసాల చేసుకోవడానికి వస్తాం అని శంకరం తల్లిదండ్రులు సుధ తల్లిదండ్రులను అడిగారు. తనకు ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన కారణం చేత బారసాల ఇప్పుడు వద్దు మూడో నెలలో చేద్దాం అన్నారు. ఇంక అమ్మాయి తరపువారి మాటకు అడ్డం చెప్పడానికి లేక సరే అన్నారు శంకరం వాళ్ళు.

కాని మనవరాలిని చూడాలి అని సావిత్రమ్మకి, సత్య౦లకి, కూతురుని చూడాలి అని శంకరానికి చాలా ఆశగా ఉంది. ఇంక ఉండబట్టలేక మేము చూడటానికి వస్తున్నాం అని ఫోన్ లో నాలుగు ముక్కలు పడేసి ఆనందంగా హైదరాబాదులో దిగారు శంకరం తల్లిదండ్రులు. సుధ ఇంటికి పదండమ్మా అని కాళ్ళకి చెప్పారో లేదో చాలా త్వరగా వచ్చేసారు. ఇక సుధ తల్లిదండ్రులు అంటే సుజాత, శేకరం లోపలికి ఆహ్వానించారు.

మనవరాలీని చూడాలి అన్న ఆశతో సావిత్రమ్మ బెడ్ రూమ్ వైపు పరుగు తీసింది. వెనకాలె సుజాత వచ్చి అరె ఆగండి వదినగారు. తరవాత చూద్దురుగాని ముందు స్నానాలు అది చేసి మీరు కుదుటపడండి అంది. సుజాత మాట నోటిలో ఉండగానే నా మనవరాలిని చూడాలి అంటూ సుధ గది వైపు పరుగు తీసింది.

గది తలుపు చాలా ఆతురతగా తెరిచిన సావిత్రమ్మకు అనుకోని సంఘటన జరిగింది. సుధ బిడ్డని ఎవరికీ ఇవ్వట్లేదు. నా బిడ్డని ఎవ్వరికి ఇవ్వను రావొద్దు అంటూ సుధ పెద్దపెద్ద కేకలు వేస్తూ ఉంది. ముఖం నిండా కోపం, చింపిరి జుట్టుతో అందవికారంగా ఉంది. అది చూసిన సావిత్రమ్మ నోట మాట లేదు. ఏమయిందమ్మా అంటూ కొడుకు, భర్త ఇద్దరూ వచ్చారు.

చూసిన ముగ్గురు ఏమి చేయాలో ఏమి జరుగుతుందో తెలీక బొమ్మల్లా ఉండిపోయారు. సావిత్రమ్మ తల్లిదండ్రులు అయితే మాట లేకుండా చూస్తూ ఉండిపోయారు.

ఇదంతా అప్పుడే వచ్చిన ఫ్యామిలీ డాక్టర్ రాజు చూసి పరిస్థితి అర్ధం చేసుకుని వాళ్ళందరిని ఇలా రండి హాల్లో కూర్చోండి స్థిమితంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు. కంగారు పడిపోతున్న వాళ్లకు ధైర్యం చెప్పాడు.

డాక్టర్ గారు కాస్త ఏదయినా తిన్నాక వాళ్లకి నిజం చెప్పండి. ఇప్పుడే వచ్చారు ఏమి తినలేదు అంది సుజాత.

దానికి సమాధానంగా డాక్టర్ కూడా సరే అన్నాడు.

“ముందు మీరు ఫ్రెష్ అయ్యి, కాస్త ఏదయినా తినండి అప్పుడు డాక్టర్ గారు మాట్లాడుతారు” అంది సుజాత. డాక్టర్ మాట్లాడటం ఏంటి అర్ధం కానీ అయోమయ స్థితిలో ఉండిపోయారు ముగ్గురూ.

పాపం తన మనవరాలిని చూడాలని వచ్చిన సావిత్రమ్మ నోట మాట లేకుండా ఉండిపోయింది.

అందరూ తప్పక రెడీ అయ్యి, కాస్త ఏదో తాగాము అన్న పేరుకి కాసిన్ని టీ నీలు తాగి వచ్చి హాల్లో కూర్చున్నారు.

డాక్టర్ రాజు కూడా వచ్చి వాళ్ళతో కూర్చున్నాడు. అందరిని చూసి మీరు ఏమి కంగారు పడద్దు. అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు డాక్టర్ రాజు. సావిత్రమ్మ ప్రత్యేకంగా చెప్పాడు డాక్టర్ రాజు. ఇక విషయం అంతా చెప్పనారంభించాడు.

“మీ సుధని హాస్పిటల్ కి తీసుకువచ్చినప్పుడు గైనకాలజిస్టు చెకప్ చేసి బిడ్డ చాలా బాగుంది ఆరోగ్యంగా అని చెప్పారు. నెలలు కూడా నిండాయి కాబట్టి త్వరలో డెలివరీ వస్తుంది అని చెప్పారు. అయితే నెలలు నిండినా నొప్పులు రాలేదు. దానితో ఇబ్బంది గా ఫీల్ అయిన సుధని హాస్పిటల్ కి తీసుకువస్తే డాక్టర్స్ చెక్ చేసి, ఫ్రీ డెలివరీ కష్టం ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఆ మాటలు అన్ని సుధ ఎదురుగానే మాట్లాడుకున్నాం. ఆ మాటలు తను విన్న వెంటనే ఆపరేషన్ కి ఒప్పుకోలేదు. అపరేషన అంటే తనకి మత్తు మందు ఇస్తారు అని, మత్తు మందు ఇస్తే తను స్పృహ కోల్పోతుంది అని అప్పుడు తన బిడ్డని తీస్కెళ్ళిపోతారు అని భయపడిపోయింది. తను అలా ఎందుకు భయపడిందో మాకయితే అర్ధం కాలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు బలవంతంగా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసాము. స్పృహ వచ్చాక ఆమె బిడ్డని ఎవ్వరికి ఇవ్వలేదు. నా బిడ్డ అంటూ తన దగ్గరే ఉంచుకుటుంది. అసలు ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలీట్లేదు”.

ఈ మాటలు విన్న సుధ అత్తమామలు, భర్త కన్నీళ్లు పర్యంతం అయ్యారు. “ఏమిటిది భగవంతుడా” అంటూ సావిత్రమ్మ కూలబడిపోయింది.

సుధ తల్లి సుజాత ఏడుస్తూ ఇందుకే బిడ్డని ఎవ్వరికి ఇవ్వట్లేదు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని సంతోషపడాలో లేక తన పరిస్థితి ఇలా అయినందుకు భాదపడాలో తెలీట్లేదు. అందుకే మీకు ఈ విషయం చెప్పలేదు అంది.

“అసలు తను సుధే! ఒకప్పుడు నాలుగేళ్ల క్రితం మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టినప్పుడు మా ఇంట్లో అన్ని అలవాట్లకు అలవాటు పడింది. నన్ను సొంత తల్లిలా చూసుకునేది. నాకు కూతురు లేదు అన్న లోటు తన ద్వారా తీరింది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటి భగవంతుడా?” అంటూ ఏడ్చింది సావిత్రమ్మ.

“మరి డాక్టర్ కి చూపించలేదా అత్తయ్య అన్నాడు” సుధ భర్త శంకరం.

“చూపించాం అయ్యా”

“మరి ఏమన్నారు డాక్టర్”

అప్పుడు డాక్టర్ రాజు మాట్లాడుతూ “సాధారణంగా బిడ్డలను కనే తల్లులకి ఇది నిజంగా పునర్జన్మ అంటారు. ఎందుకంటే ఒక నిండు గర్భిణి ఒక బిడ్డకు జన్మని ఇవ్వాలి అంటే తన శక్తి అంతా కూడగట్టుకుని, తన నరాలను బిగబెట్టి, శక్తి ఎక్కడలేని శక్తి అంత తెచ్చుకుని కంటుంది. ఇలా కన్నాక కొందరు స్త్రీలు హార్మోన్ల ప్రభావం వల్ల కొన్ని మర్చిపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఒక నాలుగు రోజులు ఉంటారు అలాగ తరవాత మామూలు అయిపోతారు. అందుకే నాలుగు రోజులు ఆగి చూద్దాం అని చెప్పాను” అన్నాడు డాక్టర్ రాజు.

“కానీ ఇప్పుడికి పదిహేను రోజులయింది పరిస్థితి అలానే ఉంది” అంటూ ఏడ్చింది సావిత్రమ్మ. మవరాలి మీద ఎంతో ఆశతో వచ్చింది సావిత్రమ్మ.

“మీరు కంగారు పడకండి. రేపు ఇంకో డాక్టర్ దగ్గరికి తీస్కెళ్తున్నాం. ఎలాగో మీరు కూడా వచ్చారు కాబట్టి. మీరు మాతో రండి. ఈ రోజుల్లో తగ్గని రోగం ఏది లేదు మీరు కంగారు పడకండి” అంటూ ధైర్యం చెప్పాడు డాక్టర్.

అయోమయంలో ఉన్న సుధ తండ్రి “అవును బావగారూ! మీరు కూడా రండి” అంటూ ప్రాధేయపడ్డాడు.

“నేను తప్పకుండ వస్తాను” అంటూ అయోమయంలో ఉన్న సత్యం మాట ఇచ్చాడు.

ఇక సుధ భర్త శంకరం అయితే అసలు తన చుట్టూ ఏమి జరుగుతుంది. సుధ అసలా నా భార్యేనా అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు.

“ఏమి కాదు మీ భార్య మామూలు అవుతుంది” అంటూ డాక్టర్ ధైర్యం చెప్పాడు.

ఇక రేపు అంతా వెళదాం మాట్లాడదాం అంటూ సెలవు తీసుకున్నాడు డాక్టర్ రాజు.

తరవాత రోజు అందరూ డాక్టర్ దగ్గరకి బయలుదేరారు. సుధ రిపోర్ట్స్ చూపించారు. రిపోర్ట్స్ అన్ని డాక్టర్ చెక్ చేసి, చూడండి ఇది మీకు తెలిసినా విషయమే నేను మళ్ళి చెప్తాను. ఒక గర్భిణి బిడ్డను కనాలి అంటే శక్తిని అంతా కూడగట్టుకోవాలి. అలాంటి సమయంలో వారు ఒక నాలుగు ఐదు రోజులు వింతగా ప్రవర్తిస్తారు. కాని సుధ మాత్రం పదిహేను రోజులయినా ఇంకా తేరుకోలేదు. ఇక పోతే మీరు మీ కోడలిని మీ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అంటే తొమ్మిది నెలలు ఆమె మంచి వాతావరణంలో పెరిగింది.

“కాని మాములుగా అయితే సుధ ఈ పాటికే తేరుకుని ఉండాలి కానీ తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది” అనేది తెలుసుకోవాలి అన్నారు డాక్టర్ గారు.

సుధ తల్లి ఎందుకు డాక్టర్ గారు అని అడిగింది చాలా ఆతురతగా. కానీ ఆ ప్రశ్నకు సమాధానం వస్తే వినాలి అని అందరూ ఎదురుచూస్తున్నారు.

“కారణాలు చాలా ఉంటాయి. తను పెరిగిన వాతావరణం మంచిదే అంటున్నారు. ఆపరేషన్ కూడా బాగా జరిగింది అని తెలుస్తూ ఉంది. కాని తను ఉన్నట్టుండి అలా అవడానికి వేరే కారణం ఏదో ఉంది అనిపిస్తుంది. తనలో ఒక రకమైన భయం, కంగారు కనిపిస్తున్నాయి” అన్నారు డాక్టర్.

దీనిని సైన్స్ భాషలో “పోస్ట్ మార్టం దిసార్డర్” అంటారు. అంటే ఈ వ్యాధి స్వభావం ఎలా ఉంటుంది అంటే ప్రసవం అయ్యాక వారు ఎక్కడో తమ మనసులో ఉన్న ఆలోచన బయటకి రావటం, లేదా తమ జీవితంలో ఏదో జరగరాని సంఘటన జరగటం ఈ వ్యాధి లక్షణం. దీన్ని మామూలు భాషలో “ది బేబి బ్లూస్” అంటారు.

“మరి ఎలా డాక్టర్ ఈ సమస్య నుంచి బయట పడటం” అంది సుధ తల్లి.

“ఏమి పర్లేదు. నాకు తెలిసిన ఒక మంచి సైక్రియాటిస్టు ఉన్నారు. ఆ డాక్టర్ కి నేను ఈ కేస్ స్పెషల్ కేస్ గా చెప్తాను వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు” అని చెప్పారు డాక్టర్.

సైక్రియాటిస్టు అంటే మనసు బాలేని వారికి, వయసులో పెద్దవారికి చూస్తారు. సైక్రియాటిస్టు అనగానే అందరి ముఖాలు అదోలా అయిపోయాయి. ఇక అందరు అక్కడ సెలవు తీసుకున్నారు.

ఆ రాత్రే బయలుదేరి శంకరం వాళ్ళు తమ ఊరు వచ్చేసారు. ఇంటికి వచ్చారే కాని రోజు శంకరo, వియ్యాల వారు కలిసి అమ్మాయి తండ్రితో ఫోన్ లో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సావిత్రమ్మ పరిస్థితి అర్ధంకాక, ఏమి చెయ్యాలో తోచక అలా ఉండిపోయింది.

అందుకే సావిత్రమ్మ తో సుధని ఇంటికి తీసుకువస్తాను అంటే అంతగా కోపపడింది.

తల్లి అన్న మాటకు శంకరం ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు.

భర్త వచ్చి తనను కూర్చోబెట్టి నువ్వు కోపపడకుండా వాడు చెప్పేది విను అన్నాడు సత్యం

“ఏంటి అండీ చెప్పేది” మొన్న వెళితే దెయ్యంలా మీద పడింది చూడలేదా అంటూ మళ్ళి కోపపడింది.

తల్లి ఆవేదనను అర్ధం చేసుకుని కొడుకు పక్కకు వచ్చి కూర్చొని “అమ్మ నేను చెప్పేది విను ముందు అన్నాడు”

“మేము ఇక్కడికి వచ్చాక కూడా నాన్న, నేను కలిసి మావయ్య వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం. అక్కడ మావయ్య డాక్టర్ అలా అనగానే వాళ్లకి తెలిసిన బందువులు అందరిని కలిసారు. అలా తెలిసిన విషయం ఏంటి అంటే మావయ్యకి ఒక చెల్లెలు ఉండేదట. ఆమె పేరు దుర్గ. ఒక్కతే చెల్లెలు కావడంతో మావయ్య తనని గారంగా చూసేవాడట. ఆవిడే సుధకి మేనత్త. అయితే తన చెల్లెల్ని పెద్ద ఇంటికి కోడలిగా పంపాలి అని ఎక్కువ కట్నకానుకలు ఇచ్చి ఒక ఇంటికి చేసారు అంట. కాని వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ముందు మావయ్య వాళ్లకి తెలీదు అంట. వాళ్ళు మావయ్య చెల్లెల్ని చాలా హింస పెట్టి తెచ్చిన కట్నం కాకుండా ఇంకా తీసుకురమ్మని వేదించారట. అప్పుడే ఆయన చెల్లెలు గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చేసింది. ఒక మగపిల్లాడు ఆవిడకి పుట్టారట. అప్పుడు సుధ వయసు ఏడు సంవత్సరాలు. ఏమి తెలిసీ తెలీని వయసు తనది. పిల్లాడు పుట్టాడు అని తెలియగానే దుర్గ అత్తగారు వచ్చి పాలు తాగుతున్న పిల్లాడిని లాక్కుని నువ్వు డబ్బు తీసుకుని రా అపుడే ఈ పిల్లాడిని ఇస్తాను అందట. ఎంత చెప్పినా వినకుండా తీసుకువెళ్లి పోయిందట ఆమె. ఇక అలా జరగడంతో పచ్చి బాలింతలు అయిన ఆ తల్లి కొడుకుని గుర్తు తెచ్చుకుని మానసికంగా నలిగిపోయిందట. అలా మతి బ్రమించి ఒక బట్టల మూట దగ్గర పెట్టుకుని తన పిల్లాడు అనుకుని ఎవ్వరు దగ్గరకు వచ్చినా ఆ మూట ఇచ్చేది కాదట. అసలు దగ్గరకి ఎవ్వరిని రానిచ్చేది కాదట. అలా ఆమె కృంగిపోయి చనిపోయిందట. ఇదంతా చూసిన సుధకి అసలు అమీ జరుగుతుందో తెలీక తన మనసులో పెట్టేసుకుంది.

ఇప్పుడు తను అదే పరిస్థితి లోకి వచ్చి మత్తు ఇస్తారు అనగానే తన బిడ్డని కూడా ఎక్కడ తీసేసుకుంటారో అని తను అలా ప్రవర్తిస్తుందట. అంతే కాని సుధ పిచ్చిది కాదు అమ్మా అన్నాడు.

భర్త సత్యం తన దగ్గరకు వచ్చి సావిత్రి మేము రోజు కూడా బావగారితో మాట్లాడుతూనే ఉన్నాం. ఈ విషయం అంతా సైక్రియాటిస్టుకి చెప్పారు అంట. విషయం తెలుసుకి వాళ్ళు కొన్ని మందులు ఇచ్చారట. కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారట. ఇప్పుడిప్పుడే సావిత్రమ్మ మనసు కాస్త తేలిక పడిందట. తన బిడ్డని ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఇస్తుందట. అలాగే మనం కూడా తనని చూస్తే కొన్ని రోజుల్లో తను మనల్ని కూడా గుర్తుపడుతుందట. అందుకే డాక్టర్స్ కూడా మన ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారట. మంచి వాతావరణంలో తిరుగుతూ ఉంటే తను త్వరగా కోలుకుంటుంది అని డాక్టర్స్ చెప్పారట.

ఈ మాటలు విన్న సావిత్రి ఒక్క సారిగా తలెత్తి చూసింది. మనసేదో కాస్త భాద తగ్గినట్టు తనకి అనిపించింది.

అప్పుడు కొడుకు మాట్లాడుతూ “అమ్మా నువ్వే నాకు చెప్పావ్ భార్యని ఎలా చూసుకోవాలో. ఒక ఆడపిల్ల తన సొంత ఇంటిని వదిలి మన కుటుంబంలో కలవడానికి వస్తుంది. మన వంశాన్ని నిలబెట్టడానికి తల్లిగా మారుతుంది. అటువంటి భార్యని చాలా బాగా చూసుకోవాలి. అంత త్యాగం చేసే ఆ ఆడపిల్లని మనం కాలం అంతా చూసినా ఆ ఋణం తీర్చలేము అని చెప్పే దానివి”.మరి సుధని అలా వదిలేయడం సరైన నిర్ణయమా చెప్పమ్మా…

విన్న మాటలకు సావిత్రి మాట్లాడబోతుంటే శంకరం అందుకుని నువ్వు ఇంక మారు మాట్లాడకు వాళ్ళు రేపు వస్తున్నారు అని చెప్పాడు.

“కాని తను ఒక్కర్తే వస్తే తనని ఎలా చూసుకోవాలో నాకు తేలీదే” అంది సావిత్రి.

“లేదు సుధ వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తున్నారు” అన్నాడు సత్యం.

సరే వాళ్ళు వస్తున్నారు కదా అని తనలో తాను సర్దిచెప్పుకుంది.

మరుసటి రోజు సుధ, సుధ కుటుంబం వచ్చారు.

ఎప్పుడూ ఎంతో చక్కగా తిరిగే సుధ అక్కడికి రాగానే వాళ్ళ అమ్మ వెనకకి వెళ్లి దాక్కుని భయం భయంగా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి తను తిరిగిన ఇల్లు తానే మర్చిపోయి చుట్టూ ఏదో కొత్తగా చూసింది. సావిత్రమ్మ తనను చూసి మనసులో చాలా భాదపడింది.

తన బిడ్డని వాళ్ళ అమ్మ సుజాతకి తప్పితే ఎవ్వరికి ఇవ్వట్లేదు.

హాల్లోకి వచ్చి అందరు కూర్చున్నారు. సుధ గదిలో ఉంది. డాక్టర్ చెప్పిన సూచనలు సలహాలు అన్ని వివరించాడు సత్యం. సత్యం చెప్పిన విధంగానే ఇంట్లో వాళ్ళు అందరు మసులుకోవడం మొదలుపెట్టారు.

“ఇన్ని జాగ్రత్తలు పాటించాలా ఎలాగా?” అని భయపడింది సావిత్రమ్మ.

“వదినగారు! మీరు భయపడకండి తనకు మొత్తం నయం మళ్ళి మీ కోడలు అని తెలుసుకునేవరకు మేము ఇక్కడే ఉంటాం అని చెప్పింది” సుజాత

తన మాటకు సుజాతకు కొండంత ధైర్యం వచ్చింది.

సుజాత కన్నీళ్ళు పెట్టుకుని పిల్ల పిచ్చిది అయిపొయింది. ఇంకా అత్తగారింటికి రానివ్వరు అని ఎన్నో సూటి పోటి మాటలు అన్నారు. మేము చాలా భయపడ్డాం. కాని మీరు మంచి మనసుతో అర్ధం చేసుకున్నార౦టూ దణ్ణం పెట్టబోయింది.

సావిత్రమ్మ రెండు చేతులను అడ్డుకుని అలా అనకండి. సుధ నా కోడలు కాదు నా కూతురుతో సమానం అంది.

“నా కొడుకు మీద ఉన్న ప్రేమతో తనను అర్ధం చేసుకున్నాను. ఇక ఏమి చెయ్యాలో ఏంటో నాకు చెప్తూ ఉండండి చాలు” అంది సావిత్రమ్మ.

“సరే” అంది సుజాత.

తనకు మందులతో పాటు ఎదుటి మనుషుల బలం కూడా అవసరం అని డాక్టర్లు చెప్పారు. తనకు వేసే మందులు కేవలం హర్మోన్లని కంట్రోల్ చేస్తాయి. అయితే తన మనసు కూడా కంట్రోల్ అవ్వాలి మళ్ళి మనల్ని గుర్తు పట్టాలి అంటే ఎదో ఒకలా మనం తనతో మాట్లాడుతూ, ధైర్యాన్ని చెపుతూ ఉండాలి అని చెప్పింది సుజాత.

తనకు ఉన్న ఈ కంప్లయింట్ వల్లే తను పిచ్చి దానిలా ప్రవర్తిస్తుంది అని చెప్పింది సుజాత.

అలా అన్న సుజాత మాటకు సావిత్రమ్మ అడ్డు పడి “పిచ్చి కాదు వదినగారు కన్నతల్లి ప్రేమ. తను పిచ్చిది అని ఇంకెప్పుడూ అనద్దు. ప్రేమా పిచ్చి రెండు ఒక్కటే. సుధ వస్తుంది అని తెలిసి మా బందువులు ఎంతో మంది మమ్మల్ని తిట్టారు. ఇరుగుపొరుగు వారు నిందించారు. పిచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు అని. కాని నా కొడుకు నాకు ధైర్యం చెప్పాడు. ఏదయినా అర్ధం చేసుకునే మనసును బట్టి ఉంటుంది” అంది సావిత్రమ్మ.

అన్న మాటలకు కృతజ్ఞతగా రెండుచేతులు ఎత్తి దణ్ణం పెట్టింది సుజాత……

admin

Read Previous

సివిక్ సైన్స్

Read Next

తొలి ముద్దు