• April 20, 2019

అతడు మనిషి

పాపం తన ప్రపంచం అందంగా, చాలా ఖరీదైనదిగా ఉండాలి అనుకుంటాడు సురేష్. మంచి మంచి అందాలతో, అమ్మాయిలతో చాలా రిచ్ గా ఉండాలి. కాని దీనికి వ్యతిరేఖ ప్రపంచం కూడా ఉంది గాని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మనకు అనవసరం అనుకుంటాడు సురేష్.

కాని ఒక రోజు పాపం ఆలాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళతోనే తను బతకాల్సి వస్తుంది అని ఊహించలేదు కాబోలు.

“అమలాపురంలో బస్సు దిగి బోడసకుర్రుకి ఆటో ఎక్కి వచ్చాడు. ఆటో బోడస కుర్రులో అగ్గింది. ఆటో వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆటో వాడికి ఇచ్చాడు సురేష్. ఎదురుగా గోదావరి ఉరకలేస్తుంది ఎర్రటి నీళ్ళతో. ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. దారిలోనే చాలా తడిచి పోయాడు. దగ్గరలో ఒక బడ్డీ కొట్టు కనిపిస్తే అక్కడికి వెళ్లి నిలబడి చూస్తున్నాడు” ఉరకలేస్తున్న గోదావరి వైపు.

ఇంత వానలో ఎవరైనా ఆవలి ఒడ్డుకు వెళతారా!…

“ఒక సారి ఈ కొట్టు వాడినే అడిగి చూద్దాం”.

“ఏమయ్యా ఇప్పుడు లాంచీలు ఉంటాయా?”

“ఇయాల లాంచీలు ఉండవయ్యా. వానా సూసారా ఎలా వస్తుందో. సాయంత్రం నాలుగు అయ్యింది కాని రాత్రి తొమ్మిది అయినట్టు వాతావరణం మారిపోయింది”

“దేవుడా”….

“ఏవూరు పోవాలయ్యా”.

“ఆదుర్రు”..

“ఇయాల్టికి ఎక్కడో చోట ఆగిపోండి. గోదారమ్మ ఉరకలేస్తుంది. ఎల్తే పానాలు పోతాయి ఆ తరవాత మీ ఇట్టం” అంటూ అంగడి వాడు తన పనిలో పడ్డాడు.

వాన చూస్తే ఆగేలా లేదు. కుంభవర్షం పట్టుకుంది. చుట్టూ నది అందులో నీళ్ళు తప్ప లోకం ఏమి కనిపించట్లేదు. అలా ఏమిచేద్దాం అని ఆలోచనలో పడ్డాడు సురేష్.

ఇంతలో ఆమడ దూరాన ఒక పూరి గుడిసె కనపడింది.  ఖచ్చితంగా అందులో ఎవరో ఒకరు ఉంటారు అని చాలా ఆతురతగా పరుగు తీసాడు సురేష్.

“అనుక్కున్నట్టుగానే ఆ గుడిసెలో పొయ్యి దగ్గర కూర్చొని ఒక పెద్దాయిన ఉన్నాడు”.

ఆ చూరి వారన నిలబడి “ఏవండీ…ఏవండీ” అని పిలవడం మొదలు పెట్టాడు.

లోపల పొయ్యి దగ్గర ఉన్న ఆ పెద్దాయిన బయటకి రాకుండా “ఎవరు బాబు” అని అడిగాడు.

గుడిసె గుమ్మం చిన్నది కావడంతో తన కాళ్ళు మాత్రమే అతనికి కనిపిస్తున్నాయి. కాస్త వంగి చూసి “నాకు పడవ కావాలి అవతలి ఒడ్డువైపు వెళ్ళాలి” అని అడిగాడు.

“ముందు లోపలికి రా అయ్యా తడిచిపోతావు” అని లోపలికి పిలిచాడు.

ఒక సారి ఇంటిలో చుట్టూ చూసాడు. ఇల్లంతా తాను ఎలా అయితే ఊహించుకోకూడదు అనుకున్నాడో అలానే ఉంది. నేలను తాకే మంచం, విరిగిపోతూ ఉన్న ఒక బల్ల, నల్లబడిన గిన్నులు ఉన్నాయి.

“ఇంత వానలో పడవ పోదయ్యా పానాలకు పమాదం” అన్నాడు.

“నీకు ఎంత కావాలి అన్నా ఇస్తాను నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి”

“మీరు ఎంత కంగారు పడినా ఈ యాలకాడ పడవ పోదయ్యా”

“అలా ఆ మంచం మీద కూర్చోండయ్యా తలకి గుడ్డ ఇస్తాను చానా తడిసిపోయారు” అంటూ గుడ్డ ఇచ్చాడు.

సురేష్ లేదు నా దగ్గర ఉంది అంటూ తన బ్యాగ్ లో నుంచి తెల్లటి రుమాలు తీసి తుడుచుకున్నాడు.

తడిచినప్పుడు తెలియలేదు సురేష్ కి. మెల్లగా వణుకు పుట్టడం మొదలయింది.

“దేవుడా ఇంత వణుకా” అనుకున్నాడు మనసులో.

“ఇంతలో ఆ ఇంటివాడు పొయ్యి మీద ఒక సొట్ట గిన్నె పెట్టి నీళ్ళు పోసాడు. పొయ్యిలో నిప్పులు ఒక కుండ పెంకులో వేసి సురేష్ కూర్చున్న మంచం కింద పెట్టాడు. ఎచ్చగా ఉంటాదయ్య. మీ బట్టలు కూడా ఆరిపోతాయి” అన్నాడు.

ఆ సొట్ట గిన్నెలోని ఎర్రటి నీళ్ళు రెండు గ్లాసుల్లో పోసి సురేష్ కి ఇచ్చి తానూ తాగాడు.

బెల్లం తీపి, వగరు ఎప్పుడూ అటువంటి రుచి చూడని ఆ వ్యక్తికి ఏదోలా అనిపించింది. కాని తాగాక వణుకు కాస్త తగ్గినట్టు అనిపించింది.

కాస్త ఓపిక కూడగట్టుకున్నాక మళ్ళి అడిగాడు సురేష్.

“నీకు డబ్బు కావాలి అంటే ఇస్తాను కొంచెం నన్ను ఆవలి ఒడ్డుకి తీస్కెలయ్యా” అని అడిగాడు.

“లేదయ్యా పొద్దున్న అయితే పోతాయి” అన్నాడు ఆ పెద్దాయన.

అనవసరంగా ఇలా వచ్చాను. త్వరగా వెళ్తాను కదా అని ఇలా వచ్చాను అంటూ విసుక్కున్నాడు.

ఆ పెద్దాయిన చుట్ట వెలిగించుకుని గోడ వార కూర్చుని ఉన్నాడు.

“బస్సులు, ఆటోలు అయినా ఉంటాయా”

“ఇంత వానలో ఏమి ఉండవయ్యా అన్నాడు టౌనుకి పోవాలన్నా సానా దూరం”

“ఈ రేత్రికి ఇక్కడే పడుకో ఆయ్యా. పొద్దుగాల లేచి వెల్దువు గాని. ఏమో ఈ వాన రేపు ఎలా ఉంటాదో తెలీదు”

ఇంక చేసేది లేక అలా ఉండిపోయాడు సురేష్ పాపం.

“ఎలాంటి జీవితంకోసం ఊహించకూడదు అనుకున్నాడో ఆ జీవితంలోనే తాను ఈ రాత్రి గడపాలి అనుకున్నాడు” మనసులో.

గుమ్మం దగ్గర నిలుచుని పెద్దాయన “సొవుడు…సొవుడు” అని పిలుస్తున్నాడు.

ఆ పిలుపుకి ఒక ఆడమనిషి, ఒక పిల్లోడు లోనికి వచ్చారు.

ఆ ఇల్లాలు మగ పురుషుని చూసి లోనికి వెళ్లిపోయింది. వీడు ఎల్లి పొయ్యి దగ్గర కూర్చున్నాడు. వాడి ఒంటి మీద ఒక గుడ్డముక్క అదే గోచి తప్ప ఏమి లేవు ఇంక. ఈ లోపు ఒక గుడ్డ తెచ్చి ఆ పిల్లాడి ఒళ్ళు తుడుస్తున్నాడు పెద్దాయన.

“ఇంతసేపు యాడున్నార్రా”

ఆ మాటకి లోపల చీర మార్చుకుంటున్న అడ మనిషి గొంతు వినిపించింది.

“గొప్ప కొడుకుని కన్నావ్ మాట వింటే కదా అంత వానలో గోదాట్లోకి పోయాడు” అంటూ అరిచింది.

“ఆ మాటకి పిల్లోడు లేచి నాన్న మనం చిరంజీల్లోంటోళ్ళం”

“యదవ సిరంజీవి పిచ్చిరా నీకు”

లోపల నుంచి ఆడమనిషి వచ్చి తన వంట మొదలు పెట్టింది. ఆ వచ్చిన సురేష్ అలాగే మంచం మీద కూర్చుని ఉన్నాడు. చీకటి పడింది. ఒక లాంతరు బుడ్డి వెలిగించి గుంజకు తగిలించాడు. సురేష్ తన వాచ్ లో టైం చూసుకున్నాడు. అప్పటికి ఏడు గంటలు కావొస్తోంది. చిమ్మ చీకటి. కటిక వర్షం బయట పిట్ట కనపడనంత చీకటి.

లోనికివచ్చి మళ్ళి ఆ నిప్పులు పెట్టిన మంచం మీద కూర్చున్నాడు. బట్టలు నీరు కారడం తగ్గిని కాని ఇంకా తడిగానే ఉన్నాయి.

ఆ అడమినిషి వంట చేస్తూ ఉంటే పిల్లవాడు వెళ్లి అమ్మ బుజాలు మీద ఎక్కి ఆడుతున్నాడు.

“ఒరేయ్ సొవుడు…. ఎల్లి అది ఇప్పేసి ఏదయినా సొక్కా ఎస్కోరా అన్నాడు” తండ్రి

వాడు లోపలికి వెళ్లి సొక్కా ఏసుకుని వస్తే తండ్రి పక పక నవ్వాడు. ఏందిరా అది అని.

ఆ చొక్కా వాడు వేసుకుంటే మొత్తం మునిగిపోయాడు.

“ఆ లాంతరు వెలుగులో తన వాచ్ పెట్టి టైం చూసుకున్నాడు”సురేష్.

రాత్రి ఎనిమిది గావోస్తోంది.

లోపల నుంచి వేడి వేడి చేపల పులుసు వాసన ఆ చల్లని వాతావరణానికి బలే కమ్మగా ఉంది.

సొవుడు వెళ్లి కంచంలో వేడి అన్నం, చేపల పులుసు వేసి తెచ్చుకుని తండ్రి పక్కన కూర్చుని తినడం మొదలు పెట్టాడు.

ఈలోపు భార్య రెండు కంచాలు తెచ్చి పెనిమిటికి, సురేష్ కి వడ్డించింది. “బేగా అన్నం తినేసి పడుకో అయ్యా. పొద్దున్న మాట దేవుడు చూసుకుంటాడు” అంటూ కంచం దగ్గరకి జరిపాడు.

వద్దు అనలేనంత ఆకలి వేయటంతో కంచం వెంటనే దగ్గరకి తీసుకున్నాడు.

అడిగి అడగనట్టుగా “ఇంత అన్నం తిన్లేనండి” అన్నాడు.

“ఏముందయ్యా… అక్కడ తిను” అంది ఇల్లాలు

వేడి వేడి పులుసు, చల్లటి వాతావరణం, వద్దు అనలేనంత ఆకలి కంచంలో అన్నం అంత తినెసాను

అందరిని చక్కబెట్టి ఆమె కూడా తినేసింది. రెండు దుప్పట్లు, చాప ఇచ్చి తను పిల్లవాడు లోనికి పోయి పడుకున్నారు.

మళ్ళి లాంతరు దగ్గరకు వెళ్లి వాచ్ లో టైం చూసుకున్నాడు. తొమ్మిది గావోస్తుంది. ఇంత త్వరగా తను పడుకున్నట్టు ఎప్పుడూ గుర్తులేదు తనకి.

ఈలోపు ఇంటి ఆయన బీడీ తీసి వెలిగించుకున్నాడు.

సురేష్ ఆలోచనలో పడ్డాడు. వీళ్ళు రోజు ఇంతేనా వీరికి ఆశ అంటూ ఏమి లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపు పోన్ గుర్తొచ్చి ఫ్యాంట్ జేబులో నుంచి తన పోన్ తీసి చూసాడు. ఆ పోన్ చూడటానికి తప్ప ఎందుకు పనికిరాదు అన్నట్టు ఉంది ఆ పరిస్థితిలో. నో సిగ్నల్స్, పోన్లు రావు, వెళ్ళవు.

“ఊ…..”

బట్టలు ఇంకా చల్లగానే ఉన్నాయి అలాగే పడుకుంటే ఆరోగ్యం దెబ్బ తినచ్చు అని బ్యాగ్ లో నుంచి మరో ఫ్యాంట్, షర్టు తీసి వేసుకుని వాటిని ఆ సూరికి తగిలించాడు.

ఇంకా ఆ పెద్దమనిషి పడుకోబాబు అని చెప్పి అతను కూర్చున్న చోటే గోనెబట్ట వేసుకుని పడుకున్నాడు.

రెండవ భాగం

పొద్దున్నే మెలకువ వచ్చింది. చక్కటి వెలుగు కళ్ళకు కొట్టింది. కాని బయట గాలి, వాన అలానే ఉన్నాయి. అందులో ఏ తేడా కనిపించలేదు. సమయానికి వెళ్ళాల్సిన పని వెళ్ళకపోతే ఏమవుతుందో అనుకున్నాను కాని ఏమి జరగలేదు. ఇంత వానలో ఏ పని మాత్రం జరుగుతుంది అనుకున్నాను సురేష్.

ఇంట్లో ఆ బూచోడిలా ఉన్న పిల్లాడు తన ఎదురుగా కూర్చుని ఉన్నాడు. మీ అమ్మ నాన్న ఎక్కడ అని అడిగాడు.

“వాడు అమాయకంగా ముఖం పెట్టి రెండు వేళ్ళు చూపించాడు”.

“మీరు కూడా బయటకి వెళ్ళాలి అంటే అదుగో అక్కడ ఉన్న ఆ సంచి మొఖం మీద వేసుకుని అలా గట్టు మీదకి పొండి అని చెప్పాడు” ఆ పిల్లాడు.

సురేష్ లేచి బయటకు వెళ్లి నిలబడ్డాడు. చూరి వారన నీళ్ళు వంటి మీద పడుతూ ఉంటే

“అమ్మో…చలి”

“ఈ లోపు ఇంటి పెద్దాయన వచ్చి మీరు బయటకి వెళ్లి రండయ్యా” అన్నాడు.

అలా బయటకు వెళ్లి మొత్తం చూస్తే గోదావరి ఉరకలు వేస్తూ ఉంది. నిన్న తను వచ్చిన గట్టు, ఆవలి ఒడ్డు కనిపించట్లేదు.

బయటకు వెళ్లి తన కార్యకలాపాలు ముగించుకుని వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ ఇంటి మనిషి పిల్లోడిని వొళ్ళో పెట్టుకుని పక్కకు జరిగింది.

సురేష్ వెళ్లి తను రాత్రి పాడుకున్న చాప మీద కూర్చున్నాడు.

“కాస్త టీ నీళ్ళు ఇవ్వే” భార్యను అడిగాడు ఇంటి పెద్దాయన.

ఇంట్లో టీకి ఏమి లేవ్ అంటూ విసుక్కుంది ఆ ఇంటి ఆడమనిషి.

సరెలేవే మామూలు డికాషిన్ నీళ్ళు పెట్టివ్వు అన్నాడు.

నాకు చాలా నీరసంగా ఉంది పోయి పెట్టుకో అంటూ నిద్ద్రలోకి జారుకుందామె.

ఆ తడిసిన పుల్లల్ని ఊది ఊది పొయ్యి వెలిగించి నల్లటి నీళ్ళు నా దగ్గరకు తెచ్చాడు.

వాటిని చూస్తే ఏమిటో కూడా అర్ధం కాలేదు. తాగుతుంటే ఆ చల్లని వాతావరణానికి ముందు రుచి తెలీలేదు వెచ్చగా తాగేశాను కాని తరవాత ఎదో కాస్త వగరు తగిలింది.

“టీ తాగి గ్లాస్ కింద పెడుతూ బాబు చదువుతున్నాడా అండి” అని అడిగాడు.

“అవన్నీ మనకెందుకు బాబు. చదువుకుంటే పని ఎవరు సేత్తారు”

“దేవుడా…”

(చదివితే ఉద్యోగం వస్తుంది దానికి చదువు ఎందుకు అంటాడే) “కాదండి చదివితే మంచి జ్ఞానం వస్తుంది కదా. ఏదయినా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు”

“మావాడు చాలా తెలివైనోడండి ఆడికి చానా తెలివుంది ఇక్కడ అన్ని సేపల పేర్లు ఆడికి తెలుసు.”

“ఒరేయ్ సొవుడు సెప్పరా?….”

వాడు ఇంకా దేశం మీద ఉన్న అన్ని చేపల పేర్లు చెప్పడం మొదలెట్టాడు.

ఈ వయసులో ఈడికి ఇంత తెలివా అనిపించింది.

మాటల్లో పడి అలా తాను కూర్చున్న చోటే మెల్లగా నిద్ద్రలోకి జారుకున్నాడు సురేష్

చారు తాలింపు వాసన ముక్కులోకి వెళ్లి మెలకువ వచ్చింది.

లేచి చూస్తే బాగా వెలుతురు వచ్చి వర్షం తగ్గింది. గాలి కూడా తగ్గింది.

ఇంక లేస్తూ “నేవేల్తానండి వర్షం తగ్గింది”

“ఉండయ్యా వన్నం తినేసి బోదువ్ గాని”

“ఒసేయ్ కాస్త చారు పోసి వేడిగా అన్నం తీసుకురా”

“లేదండి నేను బయట తింటాను ఇప్పుడికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను”

“తిని పో అయ్యా మల్లి ఎక్కడన్నా ఉంటాయో లేదో”

చారు అన్నం వేడివేడిగా ఉండి మొత్తం తినేసాను

తన బట్టలు, రుమాలు బ్యాగ్ లో పెట్టుకుని ప్రయాణం అవుతున్నాడు

“నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. చాలా ధన్యవాదాలు అండి” అంటూ గుమ్మం ముందు నిలుచున్నా ఆమెతో చెప్పాడు.

ఆ ఇంటి మనిషి నాతో కలిసి ప్రయాణం అయ్యాడు నన్ను సాగనంపటానికి.

అలా మూడు మైళ్ళు నడిచాక ఒక తారు రోడ్ వచ్చింది. అక్కడ ఒక ఆటో చూసి ఉండయ్యా అడుగుతాను అంటూ ముసలాయన వెళ్ళాడు.

“ఆ అటో పోదంటయ్యా ఇంకా నడిసి పోవాల నడిసి పోతే సెంటర్ వస్తది అక్కడి నుంచి బస్సులు ఆటోలు ఉంటాయి”

సరేనండి అంటూ తన ఫ్యాంట్ జేబులో పర్సు తీసి మూడు వందలు చేతిలో పెట్టాడు.

“ఏందీ బాబు ఇది”

“నన్ను రాత్రంతా మీ ఇంట్లో మనిషిలా చూసారు కాబట్టి ఇది తీస్కోండి”

“మీరు కట్టంలో మా ఇంటికి వచ్చారు. కట్టంలో వచ్చినప్పుడు సూడాలి కదా అయ్యా అంతే కాని దానికి విలువ కట్టోద్దయ్య” అంటూ తిరిగీ ఇచ్చేసాడు.

“కట్టం వచ్చినప్పుడు మనిసికి మనిసి సాయం చేసుకోపోతే ఇంకెందుకయ్యా ఈ పానం”

“మీరెల్లండయ్య… ఇంకా వాన వస్తే నా గుడిసె మునిగేలా ఉంది నేను పోతాను”

“కట్టంలో మీ ఇంటికి వస్తే సూత్తావయ్య”

అంటూ తన గుడిసెకు వెనుదిరిగాడు పెద్దాయన.

తను సెంటర్ వైపు నడక సాగించాడు

కాని పెద్దాయన అన్న మాట మనసులో మెదులుతూ ఉంది

admin

Read Previous

తన తీర్పును తానే చెప్పుకున్న హంతకుడు

Read Next

సివిక్ సైన్స్